యూపీలో గెలుపు ఇండియా కూటమిదే!

2
- Advertisement -

2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా మోనా తెలిపారు. ఎన్నికల్లో పూర్తి బలంతో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. గత పదేళ్లుగా గణాంకాల ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని ఆరోపించారు. కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇదే ఆందోళనను వ్యక్తం చేశారని, పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు.

మరోవైపు 2027 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారం, బీజేపీ మథురపై ప్రత్యేకంగా దృష్టి సారించడంపై కూడా ఆరాధన మిశ్రా స్పందించారు. తమ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఝాన్సీ డివిజన్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అనంతరం నవంబర్ 21న ఆగ్రాలో పర్యటిస్తామని చెప్పారు.

Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్

రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూడాలని ఆమె సూచించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం వల్లే 2024 ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -