తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతుంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) ద్వారా తగిన ఆదేశాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతోందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యంగా నాగార్జునసాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం సుమారు 1,600 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణం చేపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. KRMB నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే, కేవలం ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయనే ధీమాతో పనులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు కేవలం ఎనిమిది నెలల్లోనే పనులు పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారుస్తున్నాయని ఆరోపించారు.
Also Read:శబరిమలకు పోటెత్తిన భక్తులు
తెలంగాణకు మిగిలి ఉన్న 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం KRMBకి లేఖ రాసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపులను అడ్డుకునేందుకు బోర్డు వద్ద నిరసన తెలిపారా అని నిలదీశారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిలో ఎంత నీటిని కేటాయించారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ జలదోపిడీని అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని, ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ సమస్యను న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

