భూతాపం కారణంగా ఈ ఏడాది మంచు పలకలు, హిమానీనదాలు భారీగా కరిగిపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే పరిణామమని ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ (ICCI) ముఖ్య శాస్త్రవేత్త జేమ్స్ కిర్క్‌హామ్ పేర్కొన్నారు. రాబోయే COP31 సదస్సుకు ముందు ప్రపంచ దేశాల నాయకులు ఈ పరిణామాలను హెచ్చరికగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
సమీప భవిష్యత్తులో భూమి ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటడం వల్ల మంచు పలకలు, హిమానీనదాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ICCI, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) సంయుక్తంగా ఒక నివేదిక రూపొందించాయి. ఈ సంక్షోభం కేవలం మారుమూల ప్రాంతాలకే పరిమితం కాదని, మనకు కూడా ముప్పు పొంచి ఉందని నివేదిక ప్రధాన రచయిత జేమ్స్ కిర్క్‌హామ్ సోమవారం పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే వాతావరణ మార్పుల ప్రభావాలు తీవ్రతరం అవుతాయని, అత్యంత ప్రమాదకరమైన కొన్ని పరిణామాలు తిరిగి మార్చలేని స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
UNEP ఇటీవల విడుదల చేసిన ‘లిమిటింగ్ ఓవర్‌షూట్’ నివేదికకు అనుబంధంగా ICCI రూపొందించిన ‘ఓవర్‌షూట్ అండ్ ది క్రయోస్ఫియర్’ నివేదికలో ఈ అంశాలను వివరించారు.
Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న

