ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీకి ఇటివలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు, ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ గ్రహీత కె. విశ్వనాథ్ హైదరాబాద్‌లోని తమ స్వగృహంలో బుధవారం సాయంత్రం ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట చిరు ఆత్మీయ అభినందన జరిపారు. సినీ, సాంస్కృతిక రంగాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖుల సమక్షంలో సీతారామశాస్త్రి దంపతులనూ, ఆయన మాతృమూర్తినీ విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించించారు.
ఈసందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రీ మాట్లాడుతూ..”చేంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్ళు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన ఎందరెందరో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబసభ్యులు. అందుకే, తెలుగులో సినీ గేయకవితా రచనకు తొలిసారి దక్కిన ఈ ‘పద్మశ్రీ’ నాది… కాదు వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు… ఆశీర్వాద సభగా భావిస్తున్నా” అన్నారు.
దర్శకుడు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ.. ”ఈ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే, రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగినా సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజుల లానే ఇప్పటికీ నిగర్వంగా ఉండడం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా” అని విశ్వనాథ్ అన్నారు.
సరిగ్గా 87 ఏళ్ళ క్రితం తెలుగు సినిమా పుట్టినరోజైన ఫిబ్రవరి ఆరునే ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం బాగుందనీ, శాస్త్రి గారికి వచ్చినందుకు ‘పద్మశ్రీ’నే అభినందించాలనీ దర్శకులు వి.ఎన్. ఆదిత్య, ఇంద్రగంటి మోహనకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కాశీవిశ్వనాథ్, బి.వి.ఎస్. రవి, కె. దశరథ్, రచయితలు జనార్దన్ మహర్షి, బుర్రా సాయిమాధవ్, రామజోగయ్యశాస్త్రి, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు గుండె లోతుల్లో నుంచి తమ అనుభవాలు,
అనుభూతులను పంచుకున్నారు.