ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారీ స్కోరుతో భారత్‌కి దాయాది పాకిస్థాన్ సవాల్ విసిరింది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ ఫకార్ జమాన్ (114: 106 బంతుల్లో 12×4, 3×6) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.
మ్యాచ్ ఆరంభంలో భారత్ బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేయడంతో జమాన్‌తో కలిసి మరో ఓపెనర్ అజహర్ అలీ (59: 71 బంతుల్లో 6×4, 1×6), బాబర్ అజామ్ (46: 52 బంతుల్లో 4×4) కీలక ఇన్నింగ్స్ ఆడి పాక్‌కి మెరుగైన స్కోరు అందించారు.
టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ని మెయిడిన్‌గా మలిచి భువనేశ్వర్ కుమార్ టీమిండియాకి శుభారంభమివ్వగా.. నాలుగో ఓవర్లో వికెట్ అవకాశాన్ని బుమ్రా వృథా చేశాడు. ఆఫ్ స్టంప్‌కి దూరంగా విసిరిన బంతిని జమాన్ ప్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తూ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చేశాడు. కానీ.. ఆ బంతి నోబాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జమాన్ ఏకంగా శతకం బాదేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఓపెనర్ అజహర్ అలీతో కలిసి తొలి వికెట్‌కి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జమాన్.. అనంతరం రెండో వికెట్‌కి కూడా బాబర్ అజామ్‌తో కలిసి 72 పరుగులు జత చేశాడు. అయితే జట్టు స్కోరు 200 వద్ద జమాన్ ఔటవగా.. తర్వాత వచ్చిన షోయబ్ మాలిక్ (12: 16 బంతుల్లో 1×6) నిరాశపరిచాడు. కానీ.. చివర్లో మహ్మద్ హఫీజ్ (57 నాటౌట్: 37 బంతుల్లో 4×4, 3×6), ఇమాద్ వసీమ్ (25 నాటౌట్: 21 బంతుల్లో 1×4, 1×6) ఐదో వికెట్‌కి అజేయంగా 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్థాన్ 338 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.