హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం రాత్రి హెచ్ఐసీసీలో నిర్వహించిన నవ నక్షత్ర సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్.. ప్రఖ్యాత సినీ దర్శకుడు.. కళాతపస్వి కే విశ్వనాథ్‌ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటుచేస్తానని చెప్పారు.
విశ్వనాథ్ తెలుగు సినీరంగంలో గొప్పవ్యక్తి అని, ఆయన సినిమాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతంచేశారని కొనియాడారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీ ఏర్పాటైన తర్వాత సినీ పరిశ్రమ వృద్ధిలోకి వచ్చిందన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ వంటి వారు తెలుగు సినీరంగంలో ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. సినీ దర్శకులు నలుగురికి ఉపయోగపడేవిధంగా సినిమాలు తీయాలని కోరారు.
దేశంలో సంపద ఎట్లా పెరుగుతున్నదో అశ్లీలత కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నదని.. ఈ పరిణామాన్ని నిరోధించడానికి మీడియా సహకరించాలని కోరారు.న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్లుగానే ఉండాలి తప్ప వ్యూస్ పేపర్లుగా మారొద్దని, అది సమాజానికి మంచిది కాదని సీఎం అన్నారు. సమాజంలో గుర్తింపు లేకుండా ఉన్నవాళ్లను మీడియా వెలుగులోకి తీసుకురావాలని కోరారు.