హైదరాబాద్‌లో వైభవంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల చివరి ఘట్టమైన వినాయక నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. శోభాయాత్ర, నిమజ్జనం వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్ మరియు ఇతర చెరువుల వద్దకు తరలిరానున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రయాణికులకు బిగ్ గుడ్ న్యూస్ అందించింది.
నిమజ్జనం రోజున భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో రైలు వేళలను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణ రోజుల్లో రాత్రి 11:00 గంటలకు ముగిసే మెట్రో సర్వీసులు, నిమజ్జనం రోజున అర్ధరాత్రి 1:00 గంట వరకు అందుబాటులో ఉంటాయి. అన్ని కారిడార్లలోని (మియాపూర్ – ఎల్‌బీ నగర్, నాగోల్ – రాయదుర్గం, జూబ్లీ బస్ స్టేషన్ – మహాత్మా గాంధీ బస్ స్టేషన్) చివరి టెర్మినల్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1:00 గంటకు చివరి రైలు బయలుదేరుతుంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రధాన స్టేషన్లలో అదనపు సర్వీసులు మరియు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం సందర్భంగా భారీగా వాహనాల ఆంక్షలు అమలులో ఉంటాయి. రోడ్డు రవాణా, క్యాబ్‌లు మరియు ఆటోలలో రాకపోకలు సాగించడం అత్యంత కష్టతరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో వేళల పొడిగింపు భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్
ట్రాఫిక్ చిక్కులు లేకుండా హుస్సేన్‌సాగర్‌కు చేరుకోవడానికి ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ మెట్రో స్టేషన్లను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం సూచించింది.

