తెలంగాణలో ఇటీవల ఎదురవుతున్న విద్యుత్ కొరత మరియు కరెంట్ కోతలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటూ బీఆర్ఎస్ (BRS) నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకునేందుకు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ ప్లాంట్ల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాలను పోలీసులు అడ్డుకోవడంతో భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బొగ్గు తరలింపు – బకాయిల నెపం: “సింగరేణిలోని నాణ్యమైన బొగ్గును మన విద్యుత్ అవసరాలకు వాడకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే, తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ. 52,000 కోట్ల బకాయిలు చెల్లించడం లేదని, అందుకే ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరతర్పడింది” అని మండిపడ్డారు.
పక్క రాష్ట్రాల్లో లేని కరువు ఇక్కడేందుకు?: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లేని నీటి కరువు, విద్యుత్ సంక్షోభం ఒక్క తెలంగాణలోనే ఎందుకు కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వాడుకుంటుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది? దేవాదుల నుంచి గోదావరి నీళ్లు ఏపీకి తరలిపోతుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు?” అని నిలదీశారు.
కరెంట్ కోతలు, పవర్ ప్లాంట్ల పనితీరుపై నిజనిర్ధారణ చేసేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందాలు వివిధ థర్మల్ పవర్ స్టేషన్ల వైపు బయలుదేరాయి. అయితే వారి పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ప్లాంట్ల పరిసర ప్రాంతాలు నిరసనలకు వేదికగా మారాయి.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (మన్ గురు): పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఇతర నాయకులు ప్లాంట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా, నిరసనకు దిగారు.
Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (దామరచర్ల): వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మరియు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ప్రజా సమస్యలను, విద్యుత్ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను నిర్బంధిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీనిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

