దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్, మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, నిర్మాణ వ్యర్థాల సేకరణకై ఉపయోగిస్తున్న పోర్టబుల్ కంప్యాక్టర్లను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి అధికారుల బృందం నేడు పరిశీలించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, స్పెషల్ కమిషనర్ సుజాత గుప్త తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఘన వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించేందుకు ఏర్పాటుచేసిన పోర్టబుల్ కంప్యాక్టర్ల పనితీరును జి.టి.బి నగర్ కలెక్షన్ పాయింట్‌లో పరిశీలించారు.
ఈ పోర్టబుల్ కంప్యాక్టర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, ముఖ్యంగా వ్యర్థాల తరలింపులో రోడ్లపై పడకుండా నిరోధించడం, అనవసర వ్యర్థాలను స్వీకరించకపోవడం, వ్యర్థాల తరలింపు అత్యంత సులభంగా ఉండి అధిక ట్రిప్‌లు రవాణా చేయడానికి అనుకూలంగా ఉన్న అంశాలను న్యూఢిల్లీ మున్సిపల్ అధికారులు వివరించారు. రాంకీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేస్ట్ టూ ఎనర్జీ, లీచెట్ నిర్వహణ కేంద్రం, ల్యాండ్ ఫిల్ నిర్వహణ, గ్రీన్ బెల్ట్ తదితర ప్రాంతాలను ఈ బృందం సందర్శించింది. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా కాలుష్య నిరోధానికి చేపట్టిన చర్యలను రాంకీ సి.ఇ.ఓ గౌతమ్ రెడ్డి వివరించారు. ఢిల్లీ భావన నగర్‌లో ఏర్పాటు చేసిన 24మెగా వాట్ల సమీకృత వేస్ట్ టూ ఎనర్జీ పవర్ ప్లాంట్‌ను మేయర్ బృందం పరిశీలించింది.
ఇదే మాదిరి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అదిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను భావన నగర్ విద్యుత్ ప్లాంట్ ద్వారా తెలుసుకున్నారు. ఢిల్లీలో వార్డుల వారి జనాభా, మున్సిపల్ వ్యర్థాల సేకరణ విధానం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు, వాటి నిర్వహణ, రవాణా నిర్వహణ విధానం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహిస్తున్న శానిటేషన్ పై సవివరణ నివేదికను రూపొందించి జిహెచ్ఎంసికి అందజేయాలని మేయర్ రామ్మోహన్ వారికి సూచించారు.
అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రీ ప్లాంటేషన్ చేపట్టేందుకు స్థానికులను భాగస్వామ్యం చేస్తూ సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు. దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లను పోల్చిచూస్తే హైదరాబాద్ నగరంలో తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి అందించే విధానం ఎంతో మెరుగ్గా ఉందని గణాంకాలతో తెలుపుతూ రాంకీ సి.ఇ.ఓ గౌతమ్ రెడ్డి మేయర్ బృందానికి వెల్లడించారు. మున్సిపల్ వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ నిర్వహణ సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, వాటిని అదిగమించేందుకు చేపట్టిన చర్యలపై రాంకీ బృందంతో చర్చించారు.