నాగార్జునసాగర్, శ్రీశైలంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రాజెక్టుకు ఎగువనుంచి 2.51 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టులో నీటినిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలుకాగా ప్రస్తుతం 307 టీఎంసీల నీరు ఉంది.
ఇక శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,56,607 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 884.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో 215.80 టీఎంసీలకు గాను 211.47 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.