ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి కీలక సమావేశానికి సిద్ధమవుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ వెలిసిన వివాదాస్పద హోర్డింగ్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవాళ కూటమి అగ్రనేతల భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన వివాదంపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేతలు సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. బీహార్ నేత తేజస్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ నేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ప్రత్యక్షంగా హాజరుకానుండగా.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్రే వర్చువల్‌గా పాల్గొననున్నారు.
మరోవైపు సీఈసీ వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఇప్పటికే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని, వారు పదవుల్లో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలని విపక్షాలు కోరుతున్నాయి.
Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్ టైటిల్
ఈ కీలక భేటీకి ముందే విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ప్రచార బోర్డులు ప్రత్యక్షం కావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

