హైదరాబాద్ ప్రజలు ఏళ్ల తరబడి కలలుగంటున్న మెట్రో రైలు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించింది. తొలిదశలో 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రాగా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేరకు తీరాయి.
గ్రేటర్ ప్రజలతో పాటు సినీ రంగాన్ని కూడా మెట్రో విశేషంగా ఆకట్టుకుంటోంది. మెట్రో స్టేషన్లు ప్రపంచస్ధాయి విమానాశ్రయాలను తలపించేలా ఉండటంతో సినిమా షూటింగ్‌ల కోసం క్యూకడుతున్నారు దర్శకులు.
అల్లరి నరేష్ బందిపోటు, నితిన్ లై, అఖిల్ హలో మూవీస్ లోని కొన్ని సీన్స్ మెట్రో స్టేషన్స్ లో చిత్రీకరించారు. ఒక్క సినిమా వాళ్లే కాదు.. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా మెట్రో స్టేషన్స్ లో పర్మీషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్స్ లో షూటింగ్ తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హీరో, హీరోయిన్స్ కలుసుకునేది, లవ్ ట్రాక్ సీన్స్ కు బాగా వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు. గతంలో కాచిగూడ, ఖైరతాబాద్ రైల్వేస్టేషన్లలో షూటింగ్స్ కు డిమాండ్ ఉండేది. మెట్రో వచ్చిన తర్వాత ఈ స్టేషన్స్ కు గిరాకీ తగ్గిపోయింది. నాగోల్, మియాపూర్ స్టేషన్స్ వైపు చూస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.