కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని INDIA కూటమి చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు పలువురు ప్రతిపక్ష నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా నిరసనలకు కూటమి పిలుపునిచ్చింది.
అక్టోబర్ 8ను ‘భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే’గా పాటిస్తున్నట్లు INDIA కూటమి ప్రకటించింది. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ స్థాయిల్లో నిరసనలు నిర్వహిస్తోంది. బుధవారం జరిగిన ఆందోళనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం జంతర్ మంతర్ సమీపంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసుల బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. రాహుల్ గాంధీ బారికేడ్‌కు ఏర్పాటు చేసిన గేటును తెరవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా కింద పడిపోయారు.
తమ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, పలువురికి గాయాలయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన పార్టీ.. జ్ఞానేశ్ కుమార్‌ను CEC పదవి నుంచి తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది.
Also Read:ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు!
మరోవైపు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశానికి INDIA కూటమి ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరిందని తెలిపారు. అక్టోబర్ 2న తొలిసారి రాష్ట్రపతి కార్యాలయానికి అభ్యర్థన పంపామని, అనంతరం సమావేశానికి హాజరయ్యే నేతల పేర్లు పంపాలని రాష్ట్రపతి భవన్ కోరిందని చెప్పారు. దీంతో అక్టోబర్ 5న నేతల పేర్లతో మరోసారి అభ్యర్థన పంపినట్లు తెలిపారు. అక్టోబర్ 7, 8 లేదా 9 తేదీల్లో సమావేశానికి అవకాశం ఇవ్వాలని కోరామని, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని వేణుగోపాల్ వెల్లడించారు.

