రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 16 ఎంపీ స్థానాల్లో ఇప్పటికే 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా మిగిలిన 9 స్థానాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతోంది.
రేపు టీఆర్ఎస్ కరీంనగర్‌లో ఎన్నికల శంఖారావం పూరించనుండటంతో బహిరంగసభలో లేదా సభకు ముందే లిస్ట్‌ను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.ప్రగతి భవన్ నుంచి కాల్ వస్తే వెళ్లేందుకు టికెట్లు ఆశీస్తున్న అభ్యర్ధులు హైదరాబాద్ లోనే మకాం వేశారు. రెండు విడతల్లో అభ్యర్దులను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతుండగా మొదటి విడతలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలను ప్రకటించి మిగతా వారిని రెండో దఫాలో ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. మొత్తంగా కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు
కొందరి పేర్లు కన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నా ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో అన్న టెన్షన్ ఆశావహులను నిద్ర పట్టనీయడం లేదు. 7 నుంచి 8 స్థానాల్లో పాతవారికే మళ్లీ టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు. వినోద్ కమార్, కవిత, బీబీపాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, నగేష్, పసునూరి దయాకర్ లకు ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి అనధికారిక ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలు లేనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి లు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంకావడంతో చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌పై సందిగ్ధత నెలకొంది.
సికింద్రాబాద్ సీటు కోసం కుమారుడు సాయికిరణ్ కోసం తలసాని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మల్కాజ్ గిరి నుండి నవీన్ రావు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ పి.రాములు, మహబూబాబాద్ లో మాలోతు కవిత, ఖమ్మం వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మహబూబ్ నగర్ ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్న అధికారిక ప్రకటన వెలువడేవరకు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.