75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
పదివేల మంది బలగాలను పోలీసులు మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు. ఆగస్టు 15న భూమి నుంచి ఆకాశం వరకు అన్నింటిపై నిఘా వేస్తామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపేందర్ పాఠక్ పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వచ్చిన సమాచారం మేరకు.. అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ సర్కిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని.. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేసి.. తనిఖీలు చేపట్టనున్నారు.