తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని చూస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు, అన్నా డీఎంకే మిత్రపక్షం అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్ గట్టి షాక్ ఇచ్చారు. మద్దతు లేఖల విషయంలో ఇరు పార్టీల మధ్య జరిగిన ‘డ్రామా’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
అసలేం జరిగింది?
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు చెందిన 5గురు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు మద్దతు ప్రకటించారు. అయితే, మేజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి విజయ్‌కు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో, ఏకైక ఏఎమ్మెన్కే (AMMK) ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ తమకు మద్దతు ఇస్తున్నట్లు విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి లేఖ సమర్పించారు.
విజయ్ గవర్నర్‌ను కలిసిన కొద్దిసేపటికే టీటీవీ దినకరన్ స్వయంగా తన ఎమ్మెల్యే కామరాజ్‌ను తీసుకుని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తన ఎమ్మెల్యేను టీవీకే ప్రలోభాలకు గురిచేసిందని, విజయ్ సమర్పించిన మద్దతు లేఖ నకిలీదని (ఫోర్జరీ) దినకరన్ ఆరోపించారు. తాను టీవీకేకి ఎటువంటి మద్దతు లేఖ ఇవ్వలేదని, తమ పార్టీ నిర్ణయం ప్రకారం అన్నా డీఎంకేకే మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కామరాజ్ గవర్నర్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు గిండి పోలీస్ స్టేషన్‌లో టీవీకేపై క్రిమినల్ ఫిర్యాదు కూడా చేశారు.
దినకరన్ ఆరోపణలను టీవీకే శ్రేణులు కొట్టిపారేశాయి. దీనికి నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాయి. ఆ వీడియోలో ఎమ్మెల్యే కామరాజ్ ఒక కారులో కూర్చుని, విజయ్ నాయకత్వానికి తాను స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ వీడియో పాతదని లేదా కృత్రిమమైనదని దినకరన్ వర్గం కొట్టిపారేస్తోంది.
Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్ ఆలయం
గడచిన మూడు రోజుల్లో విజయ్ మూడుసార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ, మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం టీవీకే బలం 115 వద్ద నిలిచిపోయింది (మెజారిటీకి ఇంకా 3 స్థానాలు తక్కువ). మరోవైపు, అన్నా డీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దినకరన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరియు ‘వీడియో’ యుద్ధంతో తమిళనాడులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

