గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారత దేశ ఆత్మగౌరవానికి మరియు అలుపెరగని నాగరికత పోరాటానికి చిహ్నమని ఆయన కొనియాడారు.
1951 మే నెలలో స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో…నాటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సోమనాథ్ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ సోమనాథ్ ట్రస్ట్ తరపున ప్రత్యేక వేడుకలను ప్రారంభించారు.
సోమనాథ్ ఆలయాన్ని విదేశీ ఆక్రమణదారులు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, భారతీయులు దానిని మళ్లీ మళ్లీ నిర్మించారు. విధ్వంసకారుల కంటే సృష్టికర్తలే గొప్పవారనే సందేశాన్ని ఈ ఆలయం ప్రపంచానికి చాటిచెబుతోంది అని మోదీ అన్నారు.
సర్దార్ పటేల్ కలలుగన్న ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం ఒక బలమైన పునాది అని ఆయన అభివర్ణించారు. అయోధ్యలోని రామమందిరం నుండి కాశీ విశ్వనాథ్ ధామ్ వరకు నేడు దేశంలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవనం సోమనాథ్ నుండి ప్రారంభమైన స్ఫూర్తితోనే సాగుతోందని పేర్కొన్నారు.
Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!
సోమనాథ్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ఆధునిక సౌకర్యాలతో పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తోందని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రధాని వెల్లడించారు. సోమనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది.

