కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో రహదారులు జలమయమయ్యాయి, చెట్లు నేలకూలాయి.అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా, సాధారణ జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది.
కేరళలోని మనలూర్ ప్రాంతంలో చెట్టు ఒక తాత్కాలిక షెడ్‌పై కూలిపోవడంతో అందులో నిద్రిస్తున్న 29 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రెడ్ అలర్ట్ నేపథ్యంలో వయనాడ్, కోజికోడ్, కాసర్‌గోడ్ జిల్లాల్లో ట్రెక్కింగ్ కేంద్రాలకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు. కొండ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణాలు, క్వారీ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.అదనంగా వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.
IMD ప్రకారం నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని మధ్య-పశ్చిమ, మధ్య-తూర్పు ప్రాంతాలతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఉత్తర కేరళపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూన్ 6న కాసర్‌గోడ్, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read:లోక్‌సభకు మమతా బెనర్జీ!
జూన్ 6 నుంచి 9 వరకు కేరళ-లక్షద్వీప్-కర్ణాటక తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతో మత్స్యకారులు ఈ కాలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
అలాగే జూన్ 6 నుంచి 10 వరకు కేరళ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

