ఆసియా కప్ గెలిపించాడు…. స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. కానీ పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీని కొల్పోవడమే కాదు కనీసం జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు సూర్యకుమార్. టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేస్తూ సెలక్టర్లు షాకింగ్ నిర్ణయం తీసుకోవడమే కాదు 15 ఏళ్ల వైభవ్‌కు జట్టులో చోటు కల్పించారు.
గౌతమ్ గంభీర్ కోచ్‌గా, అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్‌గా వచ్చాక ‘సూపర్‌స్టార్ సంస్కృతి’ ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే, టెస్ట్ భవిష్యత్తును సైతం వారి ఫామ్ ఆధారంగానే నిర్ణయిస్తామని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఫామ్ లేకపోతే ఎంతటి స్టార్ అయినా పక్కన పెట్టడమే ఇప్పుడు కొత్త రూల్. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్సీ నుండి నేరుగా జట్టు నుంచే తప్పించడం దీనికి మరో ఉదాహరణ.
సూర్యకుమార్ యాదవ్ 52 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా 42 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. సూర్యకుమార్ కెప్టెన్‌గా 80 శాతానికి పైగా విజయాలతో అద్భుత రికార్డు కలిగి ఉన్నప్పటికీ గత రెండు సీజన్లుగా అతని వ్యక్తిగత ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఐపీఎల్ 2026 లోనూ అతను విఫలమయ్యాడు.
Also Read:అంబేద్కర్ పుస్తకంతో అభిజిత్..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైనప్పటికీ 35 ఏళ్ల సూర్యకుమార్‌ను ఎలాంటి వీడ్కోలు హంగామా లేకుండా పక్కన పెట్టేశారు.ఒకప్పుడు భారత్‌లో స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించే వరకు సెలెక్టర్లు ఆగేవారు. కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికల ముందు సెంటిమెంట్లు సాగవని అగర్కర్-గంభీర్ జోడీ నిరూపించింది.

