తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. లోక్‌సభలోని పలువురు టీఎంసీ ఎంపీలు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, ఇతర పార్టీల్లోకి మారేందుకు సిద్ధమవుతున్నారనే వార్తల నడుమ ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇటీవల జరిగిన 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చేతిలో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. ఈ పెద్ద ఎదురుదెబ్బ తర్వాత, లోక్‌సభలో పార్టీని మరియు అసమ్మతిని అదుపు చేయడానికి మమత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మమతా బెనర్జీ లోక్‌సభకు పోటీ చేసేందుకు వీలుగా బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న మాజీ భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను తన స్థానానికి రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్ఠానం కోరే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2011 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరిని సుమారు 85,000 ఓట్ల మెజారిటీతో ఓడించి బహరంపూర్ నుండి విజయం సాధించారు.
మమతా బెనర్జీకి లోక్‌సభలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె గతంలో కోల్‌కతా సౌత్ (ప్రస్తుతం కోల్‌కతా దక్షిణ్‌గా పిలుస్తున్నారు) నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే, ఆమె తన రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా 1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. 2011లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చారిత్రాత్మక విజయం సాధించే వరకు ఆమె లోక్‌సభ సభ్యురాలిగానే కొనసాగారు. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అసెంబ్లీకి మారారు.
మమతా బెనర్జీ మళ్లీ ఢిల్లీ రాజకీయాల వైపు చూడటానికి ప్రధాన కారణం.. లోక్‌సభలో టీఎంసీ ఎంపీల మధ్య పెరుగుతున్న అసమ్మతియేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పలువురు కీలక నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ కూడా వీరిలో ఉన్నారు. బారాసత్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆమె, సభలోనే తనను దుర్భాషలాడారంటూ సొంత పార్టీకి చెందిన కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. దస్తీదార్‌తో పాటు సీనియర్ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, శంతను సేన్ కూడా పార్టీ శైలిని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
Also Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!

