జమ్మూ కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం!

4
- Advertisement -

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా భారత్ మరోసారి తన దౌత్యపరమైన సత్తాను చాటిచెప్పింది. ఐరాస చార్టర్ లోని ‘చాప్టర్ 6’ కింద రూపొందించిన కాలం చెల్లిన మధ్యవర్తిత్వ చట్రాలను ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. అదే సమయంలో ఈ వేదికను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ తీరును భారత్ తీవ్రంగా ఖండించింది.

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, భద్రతా మండలిలో జరిగిన ఒక అనధికారిక సమావేశంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస చార్టర్‌లోని చాప్టర్ 6, చాప్టర్ 7 ల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన స్పష్టంగా వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోవడానికి చాప్టర్ 7 ఉపయోగపడుతుందని, దీనిని అమలు చేయకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని పేర్కొన్నారు.

మరోవైపు వివాదాల శాంతియుత పరిష్కారానికి ఉద్దేశించిన చాప్టర్ 6 లోని చర్చలు, మధ్యవర్తిత్వం వంటి యంత్రాంగాలు శాశ్వతమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలం, పరిస్థితులకు అనుగుణంగా వీటిని సమీక్షించాల్సిందేనని, ఇవి ఎప్పటికీ వర్తిస్తాయని అనుకోవడం ముమ్మాటికీ పొరపాటని హరీష్ వాదించారు. ఇందుకు పాలస్తీనా అంశాన్ని ఆయన ఉదాహరణగా చూపుతూ అక్కడ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మధ్యవర్తిత్వ చట్రాలు మారుతూ వచ్చాయని గుర్తుచేశారు.

ఇక ఈ చర్చా కార్యక్రమానికి కో-చైర్‌గా వ్యవహరిస్తూ, నిష్పాక్షికంగా ఉండాల్సిన పాకిస్తాన్ ప్రతినిధి.. ఈ వేదికను భారత్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూడటం పట్ల హరీష్ మండిపడ్డారు. పాక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే. అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. గతంలోనూ, ప్రస్తుతంలోనూ, భవిష్యత్తులోనూ ఈ వాస్తవంలో ఎలాంటి మార్పు ఉండదు.” అని పర్వతనేని హరీష్ పునరుద్ఘాటించారు.

Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

- Advertisement -