కేరళలోని ఇడుక్కి జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో కనీసం ముగ్గురు మరణించగా, నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియల వల్ల పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. జిల్లాలోని వాగమన్‌లో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మృతుడిని వైకమ్‌కు చెందిన ప్రభాకరన్ నాయర్‌గా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని ఇంకా వెలికితీయలేదు.
అడూర్మలలో కూడా మరో కొండచరియ విరిగిపడగా, అక్కడ ఒకరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అదిమాలిలోని మచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో గమనాగమనం నిలిచిపోయింది.ఇడుక్కి జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం మరో మహిళ తన ఇంటిపై కొండచరియ విరిగిపడి ప్రాణాలు కోల్పోయింది. కేరళ వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం జిల్లాలో కూడా పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.
కొట్టాయం జిల్లా పూంజర్ సమీపంలోని పయ్యనితోటంలో కొండచరియలు విరిగిపడి ఒక యువకుడు మృతి చెందగా, అతని తల్లి శిథిలాల కింద పూడుకుపోయింది. మృతుడిని జోసెఫ్ (జాన్ కుమారుడు)గా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆయన తల్లి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read:అస్సాం వరదలు..అప్‌డేట్
ఇడుక్కి జిల్లాలోని వాగమన్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు చిక్కుకున్నట్లు నివేదికలు వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రహదారిపై మట్టి, రాళ్లు చేరడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఉప్పుతార వద్ద కొండచరియ విరిగిపడటంతో అక్కడ నిలిపి ఉంచిన పోలీస్ జీప్ దెబ్బతింది. పుల్లాకాయార్ నది పొంగి పొర్లుతుండటంతో కొక్కాయార్ వద్ద కాజ్‌వే (చప్పత్) నీటమునిగింది. పరిసర ప్రాంతాల్లోని ఆరుకు పైగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

