అస్సాం వరదల్లో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 80కి పెరిగింది. అలాగే, ఐదు జిల్లాల్లో దాదాపు 1.92 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల ప్రభావానికి గురయ్యారు. వరద ప్రభావిత జిల్లాలైన శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నగావ్ మరియు చరాయిడియోలలోని మొత్తం 379 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా నమోదైన ఇద్దరి మరణాల్లో ఒకటి శివసాగర్‌లో, మరొకటి చరాయిడియోలో నమోదైంది.
డిఆర్ఐఎమ్ఎస్ నివేదిక ప్రకారం.. వరదల కారణంగా 1,92,799 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, 15,430 హెక్టార్ల పంట విస్తీర్ణం దెబ్బతిన్నది. అయితే ఏ జిల్లాలోనూ పట్టణ ప్రాంత వరదలు నమోదవ్వలేదని నివేదిక పేర్కొంది. జూలై 30 నాటికి వరదల వల్ల 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, రాష్ట్రంలో వరద బాధితుల సహాయ పునరావాస చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) ₹11 కోట్లు అందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి కృతజ్ఞతలు తెలిపారు. వరద ప్రభావిత కుటుంబాలకు సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు.
Also Read:వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎందుకు?
అస్సాం వరద బాధితులకు సహాయం చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు శ్రీ గౌతమ్ అదానీ గారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆన్‌లైన్ ద్వారా ₹11 కోట్ల విరాళం ఇచ్చారని తెలిసి చాలా సంతోషించాను అని శర్మ తెలిపారు. వేలాది బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో ఉపశమనం అందించేందుకు అదానీ వనరులను కూడా సమీకరిస్తున్నారని సీఎం చెప్పారు.

