హరీష్‌ను లక్ష మెజార్టీతో గెలిపించండి:కేసీఆర్

203
kcr konaipalli
- Advertisement -

మంత్రి హరీష్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేట ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

నాడు డిప్యూటీ స్పీకర్‌గా రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టానని తెలిపారు. కోనాయిపల్లిలో పూజలు చేసిన ప్రతిసారి తనకు మంచే జరిగిందన్నారు. భగవంతుడి దయ వల్ల కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి పాదాలను కడగాలని హరీష్‌కు సూచించారు.

వంద సీట్లతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో రైతులు ఆగం కాకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు. రైతులు గొప్పగా బాగుపడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమని అంతా చెప్పుకోవాలన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు.

స్వామివారి దయతో సిద్దిపేటను జిల్లా చేసుకున్నామని చెప్పారు. ఇరిగేషన్ వాటర్ ,సిద్దిపేటకు రైలు సౌకర్యం త్వరలో రాబోతుందన్నారు. విమానసౌకర్యం తప్ప సిద్దిపేటను అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. దేశంలో ధనవంతులైన రైతులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సిద్దిపేట ప్రజలు నాడు తెలంగాణ ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ సాధనలో తన వెంట ఉన్నారని తెలిపారు.

- Advertisement -