సిద్దిపేటకు గోదావరి జలాలు తీసుకురావాలనే సీఎం కేసీఆర్ కల నిజమైందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరులో మంత్రి కేటీఆర్‌తో కలిసి రంగనాయక సాగర్‌లోకి గోదావరి నీటిని విడుదల చేసిన అనంతరం మాట్లాడిన హరీష్..సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని తెలిపారు.
ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం అన్నారు. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వారి త్యాగాలు వెలకట్టలేనివని చెప్పారు.
సమైక్యరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరానికి నీళ్లు రాలేదని…. కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్దితి మారిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.