సంక్రాంతి మన తెలుగు వాళ్ళకు ఎంత ప్రత్యేకమైన పండుగనో అందరికీ తెలిసిందే. ఎన్నో పండుగలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి. కానీ సంక్రాంతి అలా కాదు. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ ఏకంగా మూడు రోజుల పాటు సందడిని తీసుకొచ్చే అతి పెద్ద పండుగ. ఏడాది కాలంలో పండిన పంట చేతికొచ్చిన సందర్భంగా పంటకు కృతజ్ఞత చాటుతూ ఘనంగా చేసుకునే పండుగే ఈ సంక్రాంతి. సంక్రాంతి అంటే కొత్త బట్టలు, ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, ఇంట్లో చేసే పిండి వంటలు, అలాగే వీధుల్లో హరిదాసు కీర్తనలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి తీసుకొచ్చే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ పండుగ సందడి అంతా కనిపించేది కేవలం పల్లెటూళ్లలోనే. సిటీలలో ఈ పండుగ సందడి పెద్దగా కనిపించదు. .
అపార్ట్ మెంట్ కల్చర్ వల్ల ఇంటిముందు ముగ్గులు కనిపించవు.. ముఖ్యంగా ముగ్గులు వేయడానికి స్థలం ఉండదు. ఇక హరిదాసు కీర్తనలు, డూ డూ బసవన్నలు సిటీలో ఎక్కడ కనిపించరు.. అందువల్ల అసలైన సంక్రాంతి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్ళాల్సిందే. అందువల్ల సొంత ఊరికి వెళ్ళేందుకు జనం బస్సుల్లోనూ ట్రైన్ లలోనూ క్యూ కడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో పండుగ సందడి అంతా కేవలం స్టేటస్ లలోనే కనిపిస్తోంది. భోగి మంట వేస్తూ ఒక పోటో, ఇంటి ముందు ముగ్గు వేస్తూ మరో పోటో, గాలిపటం ఎగురవేస్తూ ఇంకో పోటో.. ఇలా పోటోస్ అన్నీ సోషల్ మీడియాలో పెడుతూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు నేటి జనరేషన్. అయితే పల్లెటూర్లలో అలా కాదు.. సంక్రాంతి వచ్చిందంటే కుర్రాళ్ళ ఆటల పోటీలు, ఇతరత్రా టోర్నమెంట్ లు, కోడి పందేలు, ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెటూళ్లలో చేసే సందడి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మొత్తానికి నిజమైన సంక్రాంతి సందడిని ఆస్వాదించలంటే పల్లెటూర్లకు వెళ్ళాల్సిందే.
ఇవి కూడా చదవండి..