అమ్మలా ప్రేమను పంచుతాడు. నాన్నలా బాధ్యత నేర్పిస్తాడు. అక్కలా జాగ్రత్తలు చెబుతాడు. తమ్ముడిలా పేచీ పెడతాడు. గురువులా కర్తవ్యం బోధిస్తాడు. జీవితభాగస్వామిలా కష్టసుఖాల్లో తోడుంటాడు. సృష్టిలో అందరి స్థానాన్నీ భర్తీ చేయగల ఒకే ఒక్కడు.. స్నేహితుడు. ఆ స్నేహితుడే అన్ని విధాలా మన జీవితాన్నీ ప్రభావం చేస్తాడు. అందుకేనేమో, అన్ని బంధాల్నీ పుట్టుకతోనే ఇచ్చే ఆ దేవుడు, అత్యుత్తమమైన స్నేహబంధాన్ని ఎంచుకునే అవకాశాన్ని మాత్రం మనిషికే వదిలేశాడు. ప్రేమలో విఫలమైనా, భాగస్వామితో సంతృప్తిగా లేకపోయినా, వ్యాపారంలో నష్టపోయినా, చదువులో వెనకబడినా… ఇలాంటి అనేక సందర్భాల్లో భావోద్వేగాలు అదుపులో ఉండవు. మనసుని కలవరపెట్టే ఆ కల్లోల స్థితి సద్దుమణగాలంటే స్నేహితుల సాయం కావాల్సిందే. మంచి స్నేహితుడులేని లోటు మనిషిని ఎంతటి స్థితికైన దిగజారుస్తుంది.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగా.. నిను వీడిపోదురా… దోస్త్ మేరా దోస్త్ .. తుహే మేరీ జాన్.. వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. అంటూ సినీ కవులు కవిత్వాలు రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా.. వర్ణించేందుకు వీలు కానిదే.. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ద్వనింప జేసే ఏకైక పదం స్నేహం. స్నేహమనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా.. స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు.
అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఇవాళ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం… మరుపురాని, మరువలేని స్నేహానికి చిరునామాగా జరుపుకునే ఈ స్నేహితుల దినోత్సవం గొప్పదనం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహమనేది ఇలా ఉండాలి… అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు అంచనాలు ఉండవు. మనకు గురువులా భోదించి, దారి చూపి, తప్పు చేసినపుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు.
Also Read:హీరో అప్పు పై సమంత స్పందన ఇదే
మంచి స్నేహితుల మద్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమయినప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. కష్టసమయంలో కలత చెందిన మనసుకు వెన్నెలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషదం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనే ఆలోచనను కలిగిస్తుంది. ప్రతి దానికి మంచి చెడు ఉన్నట్టే స్నేహాం విషయంలో నమ్మకం, ముంద జాగ్రత్త చాలా అవసరం.
యువతీ యువకులే కాక అరమరికలు లేని స్నేహానికి గుర్తుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ రోజును జరుపుకుంటారు. నేటి ఆధునిక రోజుల్లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం యువత మధ్య పెద్ద క్రేజ్ గా మారింది. ఈ రోజు తమ స్నేహితులను కలవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. స్నేహితుల ఇండ్లకు వెళ్లి ప్రెండ్ షిఫ్ బ్యాండ్లు కడుతుంటారు. ఇలాగే స్నేహంలోని సరిగమలను ఆస్వాదిస్తూ చిన్నా పెద్దా పేదం లేకుండా ఈ స్నేహమధురిమలను కలకాలం నిలుపుకోవాలని మనసారా కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Also Read:తండ్రి కాబోతున్న యంగ్ హీరో?