సూద్ పరిచయం అక్కర్లేని పేరు…రీల్ లైఫ్‌లో విలన్ కావచ్చు కానీ రియల్ లైఫ్లో హీరో. కరోనాకు ముందు కేవలం సినిమాల్లో విలన్‌గానే సోనూను చూసిన భారతీయులు కరోనా కష్టకాలంలో అతడిలోని హీరోయిజాన్ని చూశారు.నీ.. నా అనేభేదం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తూ శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇవాళ సోనూ బర్త్ డే సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
పంజాబ్‌లోని మోగ పట్టణలో జన్మించిన సోనూ..ఇంజనీరింగ్ చదివారు. సినిమాలపై ఆసక్తితో తొలుత మోడలింగ్, ఫ్యాషన్ షోలో పాల్గొన్న సోనూ 1999లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అక్కడినుండి వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు.1996లో సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అయాన్, ఇషాన్ ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సొనాలి ఉద్యోగం చేస్తూ భర్తకు అండగా నిలబడ్డారు.
2016లో షువాజంగ్ అనే సినిమాతో చైనీస్ చిత్రసీమలో అడుగుపెట్టిన సోనూ సూద్.. కుంగ్ ఫూ యోగా సినిమాతో హాలీవుడ్ యాక్టర్ జాకీ చాన్‌కి దగ్గరయ్యారు. కరోనా కష్టకాలంలో సరిహద్దులను చెరిపేస్తూ అందరికి అండగా నిలుస్తున్న సోనూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.