హ్యాపీ బర్త్ డే….నయన్

177
nayan
- Advertisement -

నయనానందకరం ఆమె రూపం. నటనానందకరం ఆమో నటన. అటు గ్లామర్ రోల్స్ లో నయా డ్రస్సులతో ఎట్రాక్ట్ చేసినా…. నార చీరలు కట్టి భక్తిపారవశ్యాన్ని ఒలికించినా..అమ్మడికే సొంతం. అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడూ కలిస్తే నయనతార. అందుకే మూడు పదుల్లోనూ ఆమెనే కథానాయికగా కావాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఒకవైపు గ్లామర్‌ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి ‘సీతమ్మ’గా పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళం భాషలలో కూడా ఈ అమ్మడికి ఫుల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేరళ కుట్టి నయనతార పుట్టినరోజు నేడు.ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్బంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

నయనతార అసలు పేరు డయానా మరియమ్‌ కురియన్‌. తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఒమన్‌ కురియన్‌. మలయాళీ సిరియన్‌ క్రిస్టియన్‌ ఫ్యామిలీకి చెందిన నయన్‌ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాలో జరిగింది. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి కావడంతో చెన్నై, జామ్‌నగర్‌, గుజరాత్‌, దిల్లీలో స్కూలింగ్‌ పూర్తి చేసింది. తర్వాత ఆయన రిటైర్‌ కావడంతో ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ కేరళలోనే పూర్తి చేసింది.

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత ‘విస్మయతుంబట్టు’, ‘తస్కర వీరన్’, ‘రాప్పకల్’ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.

తర్వాత తమిళంలో ‘అయ్య’, ‘చంద్రముఖి’, ‘గజిని’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన ‘లక్ష్మీ’, ‘బాస్’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజైన ‘ఈ’, ‘వల్లభ’ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన ‘బిల్లా’ సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను ‘ఫిల్మ్‌ఫేర్’, ‘నంది’ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ కేరళ కుట్టి. వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉందో…ఏదో ఓ హాట్ న్యూస్‌తో వార్తల్లో నానుతూనే ఉంటుంది. ఇప్పటికే శింబు,ప్రభుదేవాలతో పీకల్లోతు ప్రేమాయణం నడిపి ఆ తర్వాత విడిపోయిన ఈ సెక్సీ తార…ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివతో ఎఫైర్ నడుపుతోంది. నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమాతో వీరికి పరిచయం ఏర్పడగా..కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. అప్పటినుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సిరియన్ క్రిస్టియన్ అయిన నయన్‌ 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది.

నయన్‌ గురించి …

() సినిమాల్లోకి రాకపోయి ఉంటే: నృత్య కళాకారిణి, లేదంటే చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయి ఉండేదాన్ని.
() సినిమా ఏం నేర్పించింది: ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతగా ఓటముల్లో కూరుకుపోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ముందుకే సాగాలి. మనకు తెలియని విషయాల గురించి నోరు విప్పకూడదు.
()నచ్చిన రంగులు: నలుపు, తెలుపు, లైట్‌ గ్రీన్‌.
()ఫ్యాషన్‌ గురించి: సింపుల్‌గా ఉండాలి. కానీ బ్రైట్‌గా ఉండాలి. నేను 100 మందిలో ఉన్నా ప్రత్యేకంగా ఉండాలి. చీరలు, సల్వార్‌ కమీజ్‌లు ఇష్టం.
()నగలు: ప్లాటినమ్‌తో చేసినవి ఏవైనా ఇష్టమే.
()ఇష్టమైన ప్రదేశం: బెంగళూరు, కెనడా, యూరప్‌
()ఇతరుల్లో నచ్చని విషయం: కోపం, మెచ్యూర్డ్‌ పీపుల్‌గా నటించేవాళ్లంటే నాకు అసహ్యం.
()మిమల్ని ముద్దుగా ఏమంటారు: కొందరు మణి అంటారు. నయన్‌, డయానా.. ఇలా ఎవరికి తోచినట్టు వారు పిలుస్తారు.
() షూటింగ్‌ లేకపోతే: పాటలు వింటుంటా, లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తా, వరల్డ్‌ సినిమాలు చూస్తా.
() ఇష్టమైన భోజనం: ఉత్తరాది వంటలు, చైనీస్‌.. అమ్మ చేతి వంటలు.
()పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలి: నా కుటుంబ సభ్యులను గౌరవించాలి. నన్ను ప్రేమగా చూసుకోవాలి. నా అభిప్రాయాలను గౌరవించాలి.

దాదాపు 13ఏళ్ళ సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించి మెప్పిస్తున్న నయన్ ఇలాగే మరిన్ని మంచి చిత్రాల్లో నటించి గొప్ప స్థాయికి ఎదగాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -