జ్ఞాన్‌వాపీ మసీదును తొలగిస్తాం- బీజేపీ ఎమ్మెల్యే

39
bjp mla

అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి దశాబ్దాలుగా దేశంలో హిందూ – ముస్లింల మధ్య మతవిద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్దిపొందిన బీజేపీ మళ్లీ మరో మసీదుపై కన్నేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో రామజన్మ భూమి వివాదానికి తెరపడింది. వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం, మరోవైపు మసీదుల నిర్మాణం మొదలవడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మందిర్, మసీదు వివాదం ముగిసిపోవడం బీజేపీ నేతలకు సుతారమూ ఇష్టం లేదు. సెక్యులర్ ఇండియాను కాస్తా హిందూ దేశంగా మార్చాలన్న ఆరెస్సెస్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలు పదే పదే మందిర్, మసీదు వివాదాన్ని రగిలిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదును కూల్చి దాని స్థానంలో అతి పెద్ద శివాలయాన్ని నిర్మించాలని బీజేపీ మరో కుట్రకు తెగబడుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదస్పద బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును తొలగిస్తామని, ఇండియా త్వరలోనే హిందూ దేశంగా అవతరిస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతం 2 వేల ఏళ్ల కిందటి నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిందని, 1664లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ అక్కడ అక్రమంగా మసీదు నిర్మించినందున ఆ ప్రాంతాన్ని మళ్లీ ఆలయానికి స్వాధీనం చేయాలని 2019లో వీఎస్‌ రస్తోగి అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మొత్తం ప్రాంతాన్ని సర్వే చేయాలని అందులో కోరారు. ఈ మేరకు కాశీవిశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్‌వాపీ మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మాట్లాడుతూ.. వారణాసి కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. వారణాసిలో జ్ఞాన్‌వాపీ మసీదును తొలగించి ఆ ప్రదేశంలో పెద్ద శివాలయాన్ని నిర్మిస్తామంటూ తీవ్ర వ్యా‌ఖ్యలు చేశారు.. ఇది హిందువుల శక్తిసామర్థ్యాలను మార్చే శకమని, రామ రాజ్యంలో ఉన్నట్టే ఇప్పుడూ కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు త్వరలోనే తొలగిపోతాయని, భారతదేశం త్వరలోనే ‘హిందూ దేశం’గా మారుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం సురేంద్రసింగ్‌కు ఇదే తొలిసారి కాదు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరును ‘రామ్ మహల్’గా మార్చాలని గత నెలలో సురేంద్రసింగ్ డిమాండ్ చేశారు. అప్పట్లో అది శివాలయమని, మొఘలుల కాలంలో దానిని కూల్చివేసి తాజ్‌మహల్‌ను నిర్మించారని అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు.

బాబ్రీ మసీదును కూల్చి దేశంలో హిందూ, ముస్లింల మధ్య మతఘర్షణలకు కారణమైన బీజేపీ ఇప్పుడు హిందువులు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే వారణాసిలో ఉన్న మసీదును తొలగించి, శివాలయం కట్టేందుకు కుట్రలు చేస్తోంది. మతం పేరుతో దేశంలో పరమత ప్రార్థనా మందిరాలను కూలగొట్టి వాటి స్థానంలో హిందూ దేవాలయాలను నిర్మించే దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చిన బీజేపీని దేశవ్యాప్తంగా లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, దేశ ప్రజలంతా తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ హఠావో..దేశ్ బచావో..!