గుమ్మడి నర్సయ్య…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
నిస్వార్థపరుడిగా,నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య…సర్పంచ్ స్ధాయి నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఇల్లెందు నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజానేతగా పేరుతెచ్చుకున్నారు.
ఒకసారి కార్పొరేటర్, సర్పంచ్‌గా ఎన్నికైతేనే ఈ రోజుల్లో వారు చేసే హాడావిడి మాములుగా ఉండదు. కానీ అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సామాన్యుడిగా జీవించడం గుమ్మడికే చెల్లింది. ఇప్పటికి బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. హైదరాబాద్‌కు వచ్చినా, ఇతర జిల్లాలకు వెళ్లిన బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు.
సింగరేణి మండలం టేకులగూడేనికి చెందిన నర్సయ్య ఆ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 1983, 1985,1989 , 1999,2004లో ఐదు సార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో, 2009లో, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక త్వరలోనే ఆయన బయోపిక్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
ఇవి కూడా చదవండి..