జీఎస్టీ .. గుడ్ అండ్ సింపుల్ టాక్స్

223
GST is Good and Simple Tax says Modi
- Advertisement -

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా సరికొత్త పన్ను శకానికి శుక్రవారం అర్థరాత్రి జేగంట మోగింది. వాణిజ్యపరంగా రాష్ట్రాల ఎల్లల్ని చెరిపేస్తూ ‘ఒకే దేశం… ఒకే పన్ను’ నినాదం కింద వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చింది. అనుమానాలు, అపోహలను పటాపంచలు చేస్తూ… ఎన్నో ఏళ్లుగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఆర్థిక నిపుణుల మధ్య తర్జనభర్జనలకు, చర్చోపచర్చలకు తావిచ్చిన నూతన, పరోక్ష పన్ను విధానం ఎట్టకేలకు పట్టాలెక్కింది. సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలు ఢంకా మోగించి కొత్త వ్యవస్థకు సాదరంగా ద్వారాలు తెరిచారు.

GST is Good and Simple Tax says Modi
జీఎస్టీ అంటే.. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ మాత్రమే కాదని.. గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అనీ.. ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.  ఒకప్పుడు.. దేశానికి స్వాతంత్రం సాధించిన సందర్భానికి సాక్షిగ నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాల్.. ఇప్పుడు కీలక ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీకి గూడ సాక్షిగ నిలిచిందన్నరు. జీఎస్టీ ప్రారంభానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను మించిన ప్రదేశం లేదని ఉద్వేగంగ చెప్పారు. ఏ ఒక్కరి వల్లో.. ఏ ఒక్క ప్రభుత్వం వల్లో జీఎస్టీ అమలు సాధ్యం కాలేదని.. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి కృషి చేస్తేనే.. ఈ ఘనత సాధ్యమైందని అన్నరు. ఇది మహానుభావుల కృషి ఫలితంగానే సాధ్యమైందని చెప్పారు. ఇప్పటి వరకూ 18 సార్లు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. పారదర్శక పన్ను విధానాన్ని రూపొందించిందని అభినందించారు. ఇన్నాళ్లూ రాష్ట్రానికి ఒక రకంగా పన్నులు అమల్లో ఉండేవని.. ఇప్పుడు ఆ విధానానికి జీఎస్టీతో ముగింపు పలికామని చెప్పారు.

జీఎస్‌టీ విధానం విజయవంతం కావడానికి అందరూ ప్రయత్నించాలి. దేశంలో వ్యాపార నిర్వహణ ఒక తీరుగా లేదు. ఈ తీరుకు జీఎస్‌టీ ముగింపు పలికే ప్రేరకం. వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి పథంలో చేరడానికి సహకరిస్తుంది. ఏక్‌భారత్‌, శ్రేష్ఠ్‌భారత్‌ సాధనకు ఉపకరిస్తుంది. నిజాయితీతో కూడిన పద్ధతులు అవలంబించేందుకు ప్రేరణగా ఉంటుంది. పన్ను ఎగవేతదారులు, నల్లధనం దాచుకునేవారి భరతం పడుతుంది. డిజిటల్‌ జాడ కారణంగా పన్ను వసూళ్లలో లొసుగులు తొలగిపోతాయి. అందువల్ల జీఎస్‌టీ చిన్న వ్యాపారులకు గొప్ప వరమని తెలిపారు.

GST is Good and Simple Tax says Modi
జీఎస్టీ ప్రారంభానికి దేశ ప్రజలంతా సాక్షులమన్నారు రాష్ట్రపతి ప్రణబ్. గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన తాను కూడా.. జీఎస్టీ రూపకల్పనల భాగం పంచుకున్ననని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా జీఎస్టీ కౌన్సిల్ బాగ పని చేసిందని ప్రశంసించారు. ఇందుకు.. కౌన్సిల్ ను ప్రత్యేకంగ అభినందిస్తున్న అన్నారు. దేశ చరిత్రలో చారిత్రకమైన మార్పునకు.. జీఎస్టీ నాంది పలికిందన్నారు. పారదర్శకమైన పన్ను విధానాలు.. ఇకపై దేశంలో ఒకే రకంగా అమలు కాబోతున్నట్టు చెప్పారు.

జీఎస్టీ ప్రవేశపెడుతున్న సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన వేడుకకు హాజరయ్యే విషయంలో ప్రతిపక్షాలు నిలువునా చీలిపోయాయి. జేడీ(యు), ఎన్‌సీపీ, బీజేడీ, సమాజ్‌వాదీ, అన్నాడీఎంకే, జనతాదళ్‌ (ఎస్‌) పార్టీలు కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, డీఎంకే, వామపక్షాలు, ఆర్జేడీ, మరికొన్ని పార్టీలు మాత్రం కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

- Advertisement -