కేరళలోని వరద బాధితుల సహాయార్థం, గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (బాయిల్డ్ రైస్) బుధవారం కేరళకు పంపించింది. పీపుల్స్ ప్లాజాలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ అకున్ సబర్వాల్ బియ్యం లారీలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.
18 లారీలు పీపుల్స్ ప్లాజా నుంచి బయలుదేరగా, మరో 6 లారీలు వివిధ జిల్లాల నుండి కేరళకు బయలుదేరాయి. కేరళ ప్రభుత్వం సూచనల మేరకు కొచ్చి-ఎర్నాకులంకు సమీపంలోని ఎడతల టౌన్లో ఉన్న సిడబ్లుసి గోదాములో బియ్యాన్ని చేరవేయడం జరుగుతుంది. బుధవారం బయలుదేరిన బియ్యం లారీలు తెలంగాణ నుండి 1102 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడతలలోని సిడబ్ల్యుసి గోదాములకు 18 గంటల్లో చేరుకుంటాయి.
ఒక్కో లారీలో 210 క్వింటాళ్ల చొప్పున మొత్తం 24 లారీల్లో 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించడం జరిగింది. బియ్యం నాణ్యత, తూకంను తనిఖీలు నిర్వహించి లోడింగ్ చేయడం జరిగింది. ఈ బియ్యం లారీలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. లారీలు ఎడతలకు చేరి అన్లోడింగ్ అయ్యే వరకు పౌర సరఫరాల భవన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, కేరళ ఫుడ్ సెక్రటరీ శ్రీ మిని ఆంథోనీ, ఫుడ్ డైరెక్టర్ డా ఎన్.టి.ఎల్. రెడ్డితో మొత్తం ప్రక్రియను సమీక్షిస్తున్నారు.