హెచ్ఎంఆర్ఎల్ ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం కసరత్తు..

113
- Advertisement -

ట్రైసిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన హైదరాబాద్ మెట్రో రైలును నష్టాల ఊబి నుంచి బైటపడేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఎలాంటి విధానాన్ని అనుసరిస్తే హెచ్ఎంఆర్ఎల్ గట్టెక్కుతుందనే అంశాన్ని ఆరాతీస్తోంది. ఎల్ & టీ సంస్థ విజ్ఞప్తిని అన్ని కోణాల్లో పరిశీలించి ఒక సమగ్ర విధానాన్ని అనుసరించేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇప్పటికే సమావేశమై మెట్రోరైలు అంశంపై ఎల్ అండ్ టీ ప్రతినిధులతో చర్చింది. నిర్వాహకులతో మరోసారి సమావేశం కావాలని అధికారులను ఆదేశించింది. మెట్రోరైలును ఆదుకునే దీర్ఘకాలిక వ్యూహంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

నష్టాల నుంచి గట్టెక్కించి మెట్రోరైలును కాపాడే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తగ్గిన ఆదాయం, పేరుకుపోతున్న వడ్డీల నేపథ్యంలో తమకు తోడ్పాటు అందించాలంటూ ఎల్ & టీ సంస్థ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జంటనగర వాసులకు సేవలందిస్తోన్న మెట్రోరైలు అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ చూరగొంది. హైదరాబాద్ మెట్రోరైలు ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థగా పేరుగాంచింది. అనేకసార్లు రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. నెమ్మదిగా పురోగమిస్తోన్న సమయంలో కోవిడ్ -19 హైదరాబాద్ మెట్రోరైలుకు శాపంగా పరిణమించింది. అనూహ్యంగా మనుగడలోకి వచ్చి, అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మెట్రోరైలును సైతం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. లాక్ డౌన్లో ఐటీ, ఇండస్ట్రీస్ తోపాటు అనేక ఇతర రంగాల్లో కార్యకలాపాలు మందగించడం, వర్క్ ఫ్రంహోం తదితర కారణాల వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.

అయితే, తరవాత క్రమంలో కోవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ, దాని ప్రభావం పూర్తిగా పోకపోవడంతో మెట్రో ప్రయాణీకుల సంఖ్య అనుకున్నంత పెరగలేదు. దీంతో క్రమంగా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. కరోనా, ఆ తదనంతరం తలెత్తిన నష్టాల నుంచి గట్టెక్కించాలని ఎల్ & టీ సంస్థ ఎప్పట్నుంచో ప్రభుత్వాన్ని కోరుతోంది. అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేసింది. కోవిడ్ మూలంగా వచ్చిన ఆర్థికనష్టాలు, తద్వారా సంస్థ చేసిన బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీలను దృష్టిలో ఉంచుకొని తమకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని కోరింది. తమ సంస్థ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొంతమేర ఆర్థికసాయం చేయాలని ఎల్ & టీ అడుగుతోంది. సాఫ్ట్ లోన్ రూపంలో కనీసం ₹ 1000 కోట్లు ఇవ్వాలనడిగింది. పాత అప్పు వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో, తక్కువ వడ్డీకి రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలంటోంది. మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా ఉన్న మాల్స్, ఇతర బిజినెస్ కోసం ఇచ్చిన స్థలాల లీజు, మార్ట్ గేజ్ విషయాల్లో నిబంధనలను సడలించాలని, వాటిని సరళీకృతం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో విద్యుత్ ఛార్జీల్లో, రవాణా పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది.

మొన్న సెప్టెంబర్లో సీఎం కేసీఆర్ ను కూడా కలిసిన ఎల్ & టీ ప్రతినిధులు, తమసంస్థ ఆర్థిక నష్టాలు, అప్పుల భారం, వడ్డీ చెల్లింపుల వివరాలను నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ & టీ ప్రతినిధుల వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అన్ని రంగాలకు చేయూతనిస్తున్న తరహాలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోరైలుకు కూడా ఆపన్నహస్తం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మెట్రోరైలును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామని మాటిచ్చారు. హెచ్ఎంఆర్ఎల్ ను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, దానికి పూర్వవైభవం తేవడానికి అనుసరించాల్సిన విధాన అధ్యయనం చేయడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన ఆ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమై మెట్రోరైలు నష్టాలు, ఎల్ & టీ చేసిన విజ్ఞప్తులను పరిశీలించింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా హెచ్ఎంఆర్ఎల్ కు ఏవిధంగా సాయం అందించగలమో పరిశీలించాలని అధికారులకు మంత్రుల కమిటీ సూచించింది. అవసరమైతే మరోసారి ఎల్ & టీ ప్రతినిధులతో చర్చించాలని ఆదేశించింది.

అయితే, ఛార్జీలు, రవాణా పన్నుల మినహాయింపు వల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం ఉండకపోవచ్చనేది అధికారుల అంచనా. ఇక లీజు, మార్జ్ గేజ్ లాంటి నిబంధనల మార్పు విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాళ్ళంటున్నారు. మెట్రోరైలు సంస్థకు ఏమేరకు ఆర్థికసాయం చేయొచ్చోనన్న విషయంపై అధికారులు కూలంకషంగా చర్చిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించుకునే క్రమంలో రుణాల మార్పు వల్ల కూడా ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఎల్ & టీ ప్రతినిధులతో చర్చించాక న్యాయపర అంశాలను కూడా పరిశీలించి ప్రభుత్వం ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఐతే, హైదరాబాద్ మెట్రోరైలు నష్టాల పరిష్కారం కోసం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా దీర్ఘకాలిక వ్యూహరచన ఒక పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా దాని సేవలు శాశ్వతంగా, విస్తృతంగా ప్రజలకందేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం.

- Advertisement -