భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది.
సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్ధమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీతను లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా అందివ్వనున్నారు.
టీటీడీ స్థానిక ఆలయాలైన అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం వేద నారాయణస్వామి, కార్వేటినగరం వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన 13 వేల క్యాలెండర్లను టీటీడీ అత్యద్భుతంగా రూపొందించి మొదటి సారిగా ముద్రించింది. ఇందులో మూలమూర్తితో కూడిన క్యాలెండర్లు రూ.20/-, ఉత్సవర్ల క్యాలెండర్ రూ.15/- లతో టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది.
యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం 25 ఏళ్ల లోపు వారికి రామ కోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. 200 పేజీలు గల గోవింద కోటి పుస్తకం ధర రూ.111/- గా నిర్ణయించింది. ఒక్కో పుస్తకంలో 39,600 వంతున, 26 పుస్తకాలలో 10 లక్షలా 1,116 సార్లు గోవిందనామాలు వ్రాసిన వారికి శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
Also Read:షాక్.. కరోనా కేసులు భారీగా పెరిగే ఛాన్స్..!