దేశంలోని చాలా రాష్ట్రాలకు సంబధించిన గవర్నర్లు మోడీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారా ? అంటే వారి వ్యవహార శైలి చూస్తే అలాగే అనిపిస్తుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయంతో కలిసి నడుస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేయాల్సిన గవర్నర్లు పార్టీకి తొత్తులుగా పని చేస్తూ ఉన్నత పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పక తప్పదు. తమిళ నాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్, కర్నాటక గవర్నర్ తవర్ చంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీకి మాత్రమే అనుకూలంగా పని చేసే గవర్నర్ల జాబితా పెద్దగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణకు గవర్నర్ గా పని చేస్తున్న తమిళ్ సై మొదటి నుంచి కూడా కేసిఆర్ ప్రభుత్వంతో విభేదిస్తూనే ఉంది.
అసలెందుకు రాష్ట్ర ప్రభుత్వంపై తమిళ్ సై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందంటే దానికి ఒక్కటే కారణం ఆమె బీజేపీకి సంబంధించిన వ్యక్తి కావడం. గతంలో ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా కూడా పని చేశారు. ప్రస్తుతం మోడీ నిరంకుశ పాలన పట్ల తీవ్రంగా విభేదిస్తున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు వరుసలో ఉంటారు. అందుకే తనను ప్రశ్నిస్తున్నా కేసిఆర్ పై మోడీ మొదటి నుంచి కూడా విభేదిస్తూనే ఉన్నారు. దాంతో మోడీకి వ్యతిరేకంగా ఉంటున్నారనే ఒకే కారణంతో రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించకపోవడం నిజంగా శోచనీయాంశం.
దీన్ని బట్టి మోడీకి తమిళ్ సై ఏజెంట్ గా పని చేస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు. ఇటీవల ఎమ్మెల్సీలో ప్రతిపాదనలో గవర్నర్ వ్యవహరించిన తీరు చూస్తే ఆమె కేసిఆర్ ప్రభుత్వం పట్ల ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతోంది. దాసోజు శ్రవణ్, ఆర్ సత్యనారాయణ వంటి వారు ఎమ్మెల్సీ కావడానికి పూర్తి అర్హత ఉన్నప్పటికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం ఆమె కక్షపురిత వ్యవహార శైలికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికి ఉన్నత పదవులల్లో ఉన్నవారు పార్టీలను దృష్టిలో పెట్టుకొని పక్షపాతంగా వ్యవహరించడం అందరినీ ఆలోచింపజేస్తోంది.
Also Read:డెంగ్యూ యమ డేంజర్.. ఇవి తినండి!