బోనాలకు ‘గోల్కొండ’ సిద్ధం

468
bonalu
- Advertisement -

ఆషాఢ బోనాలకు భాగ్యనగరం సిద్ధమైంది. జూలై 4 నుంచి బోనాల జాతర ప్రారంభంకానుండగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో సెంట్రల్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన బోనాలు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు.

ప్రాధాన్య క్రమంలో ఆలయాలకు నిధులు విడుదల చేస్తామని తెలిపిన తలసాని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయాల దగ్గర హెల్త్‌ క్యాంపులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతామన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. గల్లీగల్లీలో, బస్తీబస్తీలో అమ్మవారి అంశలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ తదితర గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇంటిల్లిపాదిని సల్లంగా సూడమ్మా అంటూ వేడుకుంటారు

ఆనాదిగా వస్తున్న ఆనవాయితీగా తొలుత గోల్కొండ కోటలో బోనాల జాతర ప్రారంభమవుతుంది. జులై 4వ తేదీ నుంచి బోనాల జాతర షురూ కానుంది. ఇక్కడ బోనాల జాతరకు అంకురార్పణ జరిగాకే విడతల వారీగా నగరంలో పలుచోట్ల పండుగ నిర్వహించుకుంటారు.

21,22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు,జూలై 27,28వ తేదీల్లో పాతబస్తీలో బోనాలు నిర్వహించనున్నారు.నిజాం నవాబు కాలంనుంచి ఈ పండగును గోల్కొండలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల పండుగ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -