జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఇక డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది అనగా 46.55 శాతం పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగు నమోదు కాగా… అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగు జరిగింది. సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్ జరుగగా.. రెండో స్థానంలో గాజులరామారం (53.65 శాతం), మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట (53.07 శాతం) ఉన్నాయి.
ఇక 150 డివిజన్ల జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో వార్డులను బట్టి 150 హాల్స్, ఒక్కో హాల్ కి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉండనున్నారు. మొత్తంగా ఓట్ల లెక్కింపునకు 8,152 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. బ్యాలెట్ బాక్సు ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. ఏజెంట్లు రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలని ప్రకటించింది. పాసులు లేనివారికి అనుమతి లేదని వెల్లడించింది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని, అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఫలితాలు ప్రకటించడానికి ముందే రీకౌంటింగ్ కోసం రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో డ్రా తీస్తామని, దానికి అనుగుణంగా తుది ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.