కోవిడ్-19 మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం జాబితా- సీఎస్‌

228
cs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అద్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటి మొదటి సమావేశం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో గురువారం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సన్నద్ధతపై కమిటీ చర్చించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. కోవిడ్ -19 మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బంది శిక్షణ, లాజిస్టికల్ ఏర్పాట్లు, ఐ.ఇ.సి. ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సీ.ఎస్ సమీక్షించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్‌ను తయారుచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డిజి జితేందర్, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మైనార్టీ కార్యదర్శి అహ్మద్ నదీం, గిరిజన శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య మరియు UNICEF, UNDP,WHO ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -