టీ హబ్‌…దేశానికే గర్వకారణం

162
- Advertisement -

జీఈఎస్ సదస్సుకు అతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో జీఈ సమ్మిట్ ప్రారంభ ఉపన్యాసం చేసిన కేసీఆర్…ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో ముందుకు పోతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ఐఐసీ పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుందన్నారు.15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని..మూడేళ్లలో 5469 పరిశ్రమలకు తెలంగాణకు వచ్చాయని తెలిపారు.

ఈజ్‌ఆఫ్‌  డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్ధానంలో నిలిచిందన్నారు. ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. స్టార్టప్‌లకు వేదికగా టీహబ్‌ను ప్రారంభించామని మంచి స్పందన వచ్చిందన్నారు. దేశానికే టీ హబ్ రోల్ మాడల్‌గా మారిందన్నారు.

తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్‌కు కేంద్రంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. ఈ స‌ద‌స్సులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు త‌మ‌ ఆలోచ‌న‌లు పంచుకుంటార‌ని తెలిపారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బిర్యానీకి హైద‌రాబాద్ పుట్టినిల్లులాంటిదని అన్నారు.

జీఈఎస్ సదస్సు నేపథ్యంలో హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో పండగ వాతావరణం నెలకొంది. అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జీఈఎస్‌ సదస్సు తొలిసారిగా మహిళలకు పెద్దపీట వేసింది.  మహిళే ప్రథమం – అందరికీ శ్రేయస్సు నినాదంతో సదస్సు నిర్వహించనున్నారు. 150కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానుండగా సగానికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలే కావడం విశేషం. వీరిలో 31 శాతం ప్రతినిధులు 30 ఏళ్లలోపు వారే.  వివిధ సమావేశాలు, చర్చల్లో దాదాపు 178 మంది ప్రతినిధులు మాట్లాడతారు. ఈ సదస్సుతో ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ ఒకే గొడుగు కిందకు రానున్నారు.

- Advertisement -