తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో భేటీ అయ్యారు. శాసనసభ సమావేశాల టీ విరామ సమయంలో కేటీఆర్‌తో గంటా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ కు రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ ను గంటా కోరారు.
గంటా కోరికపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విశాఖ పర్యటనపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తాను మద్దతు ప్రకటిస్తున్నానని… రేపు తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి జోలికి కేంద్రం వస్తే ఏపీ తమకు మద్దతు తెలపాలని ఆయన అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆయన అందరి మద్దతు కూడగడుతున్నారు.