మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మృతి

386
JaipalReddy
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన తీవ్ర జ్వరంతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు.

మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన ఐదుసార్లు లోక్‌సభకు, 2సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 4సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.

కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఐకే గుజ్రాల్, మన్మోహన్‌సింగ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1965-71 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. 2004లో మిర్యాలగూడ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్‌రెడ్డి..2009లో చేవెళ్ల లోక్‌సభ నుంచి ఎన్నికై పెట్రోలియం, సహజవాయువుల మంత్రిగా పనిచేశారు.

- Advertisement -