మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్ధి డీకే అరుణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి. కాంగ్రెస్ లో సరైన ప్యాకేజీ దొరకనందుకే డీకే అరుణ పార్టీ మారారన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం కళ్లు మూసుకుని గుంతలో పడ్డట్లేనని ఎద్దేవా చేశారు. ఇతరులపై నిందలు మోపే ముందు తన గురించి తాను ఆలోచించుకోవాలని చెప్పారు. డీకే అరుణకు పార్టీలు మారడం కొత్త కాదని..డబ్బులు, పదవుల కోసం పార్టీలు మారడం ఆమె నైజమన్నారు. ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
ఇకపై తాను సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. ఇకపై ఎన్నికలకు దూరంగా ఉంటానని అధిష్టానానికి రెండు నెలల ముందే చెప్పానన్నారు. అనారోగ్యం, వయసుపైబడడమే అందుకు కారణమని తెలిపారు. 2014ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం డీకే అరుణనే అని తెలిపారు. మరోవైపు ఇటివలే జరిగిన ఓ కార్యక్రమంలో జైపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు డీకే అరుణ. జైపాల్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత కలహాల వల్లే తాను పార్టీ మారినట్టు చెప్పారు. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అరుణ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి