ప్రయాణికులకు మెరుగైన బోర్డింగ్ అనుభూతిని కల్పించేందుకు, భద్రతా సిబ్బందిపై వ్యయాలను తగ్గించేందుకు టెక్నాలజీని విరివిగా వాడుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో దేశీయ విమానాల్లో బోర్డింగ్ ప్రక్రియను పేపర్ రహితంగా చేపట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంటే..విమానాశ్రయాల్లో ప్రవేశానికి ఇక గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదన్నమాట.
ఈ ప్రక్రయతో మొబైల్ ఫోన్‌తోనే పనులను చక్కబెట్టుకునేలా కసరత్తు సాగుతోంది. ఆధార్, పాస్‌పోర్ట్ వంటి ప్రయాణీకుల ఐడీలను ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌ల డేటాబేస్‌లకు పౌరవిమానయాన శాఖ అనుసంధానిస్తోంది. ఇది అమల్లోకి వస్తే విమాన ప్రయాణీకులు గుర్తింపు కార్డులను చూపకుండా బయోమెట్రిక్స్‌ను ఉపయోగించవచ్చని విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చూబే చెప్పారు. ప్రయాణీకులు బుక్ చేసిన విమాన వివరాలు కూడా ఎయిర్‌లైన్ డేటా బేస్ చూపుతుందని, దీంతో విమాన టికెట్ లేదా ఈ-టికెట్‌లూ అవసరం లేదని ఆయన అన్నారు.
విమానంలో ఎక్కే సమయంలో బోర్డింగ్ గేట్‌లోకి అనుమతించే ముందు ప్రయాణికుడి సెక్యూరిటీ చెకిన్ పూర్తయిందా లేదా అనే వివరాలు సైతం ఎయిర్‌పోర్ట్ డేటాబేస్‌లో నిక్షిప్తమవుతాయన్నారు. ఈ డిజీయాత్ర కార్యక్రమానికి తుదిరూపు ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన బోర్డింగ్ అనుభూతిని కల్పించేందుకు, భద్రతా సిబ్బందిపై వ్యయాలను తగ్గించేందుకు టెక్నాలజీని విరివిగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.