విదేశీ పెట్టుబడిదారులు ఈ జూన్ నెలలో ఇప్పటివరకు భారత ప్రభుత్వ బాండ్లలో రికార్డు స్థాయిలో రూ.39,640 కోట్లు (సుమారు $4.2 బిలియన్లు) పెట్టుబడి పెట్టారు. ఈ విభాగంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ పెట్టుబడి ప్రవాహం ఇదే కావడం విశేషం. ఇది గతంలో ఆగస్టు 2024 లో నమోదైన రూ.22,005 కోట్ల రికార్డును స్పష్టంగా అధిగమించింది.
భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన వరుస నియంత్రణ మరియు విధానపరమైన చర్యల వల్లే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. అర్హత కలిగిన సావరిన్ డెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లపై ‘క్యాపిటల్ గెయిన్స్ టాక్స్’ (మూలధన లాభాల పన్ను) మినహాయింపులు ఇవ్వడం, అలాగే ‘ఫుల్లీ యాక్సెస్ బుల్ రూట్’ (FAR) కింద సెక్యూరిటీలను విస్తరించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ పెట్టుబడిదారులను భారతీయ బాండ్ల వైపు ఆకర్షించేలా చేశాయి.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఈ చర్యల వల్ల భారత ప్రభుత్వ బాండ్లు ‘బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ అగ్రిగేట్ ఇండెక్స్’ లో చేరే అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో భారతదేశంలోకి మరిన్ని నిరంతర విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
డిబిఎస్ బ్యాంక్ (DBS Bank) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు రూపాయి విలువలో హెచ్చుతగ్గుల గురించిన ఆందోళనలను తగ్గించాయి. అలాగే పన్ను రాయితీలు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులలో సానుకూల వాతావరణాన్ని నింపాయి. ఈ పరిణామాలు పెట్టుబడిదారులు భారత డెట్ మార్కెట్లలో ముందస్తుగానే స్థానాలు సంపాదించుకునేలా ప్రోత్సహించాయి. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రానంతవరకు ఈ ధోరణి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
Also Read:కేంద్రమంత్రికి CJP బర్త్ డే గిఫ్ట్!
ఈ పెట్టుబడుల ప్రవాహం జూన్ 12 నాటికి $672 బిలియన్లుగా ఉన్న భారతదేశ విదేశీ మారక నిల్వలకు మరింత ఊతాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. మరోవైపు భారతీయ రూపాయి కూడా పుంజుకునే సంకేతాలను చూపించింది. మే నెలలో డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.96 కి పడిపోయిన రూపాయి విలువ ఇటీవల 94.40 కి చేరింది.

