మోదీ ముర్దాబాద్….బీజేపీ హఠావో..!

53
haryana

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో గత నాలున్నర నెలలుగా రైతన్నలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దేశ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే కొత్త వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు తేల్చిచెప్పగా…కేంద్రం కూడా కొత్త రైతు చట్టాల అమలుపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ప్రస్తుతం రైతు ఉద్యమ సెగలు దేశవ్యాప్తంగా పాకుతున్నాయి. రైతుల ఉద్యమంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపట్ల రైతన్నలు రగిలిపోతున్నారు. 5 నెలలు కావస్తున్నా కేంద్రం రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదు.. వారి ఉద్యమాన్ని లెక్క చేయడం లేదు..ఇక కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులను దేశద్రోహులు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ నోరుపారేసుకుంటున్నారు.

దీంతో బీజేపీ నేతలు కనిపిస్తే చాలు రైతన్నలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అని కూడా చూడకుండా, పోలీసులను కూడా లెక్క చేయకుండా బీజేపీ నేతలను తన్ని తరముతున్నారు. .తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోంలో, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలను తమ గ్రామాల్లోకి రాకుండా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. . కాగా ఇటీవల రైతు ఉద్యమంపై బలుపు మాటలు మాట్లాడిన పంజాబ్ బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌‌‌ను స్థానిక రైతులు బట్టలూడదీసి చితకబాదిన సంగతి తెలిసిందే. తాజాగా హరియాణాలో బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీకి రైతన్నలు చుక్కలు చూపించారు. నల్ల వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలు బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీని ఘెరావ్‌ చేశారు మోదీ ముర్దాబాద్, గో బ్యాక్ అంటూ ఎంపీ కారు అద్దాలు ధ్వంసం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం కురుక్షేత్రకు సమీపంలోని షాదాబ్ మార్కండా ప్రాంతంలోని జన్‌నాయక్‌ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్‌ కరణ్‌ కాలా ఇంటి ఎదురుగా కొంతమంది రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. అదే సమయానికి అక్కడికి సమీపంలోని మజ్రీ మోహల్లా ప్రాంతంలో ఓ బీజేపీ నేత ఇంటికి ఎంపీ సైనీ వచ్చారని వారికి సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న రైతన్నలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సైనీ కారు ముందు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ ఎంపీని వెంటనే అక్కడనుంచి సురక్షితంగా తరలించారు. మొత్తంగా హరియాణాలో బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీని ఘోరావ్ చేసిన రైతన్నలు ఆయన కారు అద్దాన్ని ధ్వంసం చేసిన ఘటన సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేసేవరకు బీజేపీ నేతలకు ఇలా రైతన్నల చేతిలో బడితెపూజ తప్పేలా లేదు.