థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. కొంతకాలంగా భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న పృథ్వీకి ఆయన భార్య ఇచ్చిన షాక్‌తో దిమ్మ తిరిగింది. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8లక్షలు భరణంగా చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాయిలింగ్ స్టార్ బబ్లూకు మైండ్ బ్లాకై పోయింది.
విజయవాడలోని అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మి(47)కి నటుడు శేషు అలియస్ మూర్తి అలియాస్ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహించేవారు. తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్‌లు కొన్నాళ్లు ఆ దుకాణం నిర్వహించారు. ఆ సమయంలో నటనపై ఆసక్తి ఉన్న పృథ్వీరాజ్ తరచూ చెన్నై వెళ్లి వస్తుండేవారు.ఈ క్రమంలో సినీరంగంలో రాణించడంతో కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత పృథ్వీరాజ్ వ్యసనాలకు బానిసై తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని శ్రీలక్ష్మి పెద్దల దగ్గర పంచాయతీకి దిగింది. దీంతో 2016 ఏప్రిల్ 05న ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. పెద్దమనుషులు దంపతుల మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోపోవడంతో 2016 నవంబర్ 02 సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఆమె పృథ్వీరాజ్‌పై 498ఎ కేసు పెట్టారు. తన భర్త ఆదాయపరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధికి అతని నుంచి నెలకు రూ.10లక్షలు ఇప్పించాలని శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు. సమన్లను పృథ్వీ అందుకోకపోవడంతో బాధితురాలు హైదరాబాద్‌లో పేపర్ ప్రకటన ద్వారా నోటీసు ఇచ్చారు. అనంతరం కేసు వాయిదాకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి బాధితురాలికి నెలకు రూ.8లక్షలు భరణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.