బీజేపీని నట్టేట ముంచిన ఈటెల!

40
- Advertisement -

బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్ ను నమ్మి మోసపోయిందా ? తెలంగాణలో బీజేపీ పరాభవానికి ఈటెలనే ప్రధాన కారణమా ? అంటే అవుననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా మారాలని బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చింది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ కంటే బీజేపీకే తెలంగాణలో బలం పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ గట్టిగానే ప్రభావం చూపుతూవచ్చింది. కానీ ఇదే టైమ్ లో ఈటెల రాజేందర్ బి‌ఆర్‌ఎస్ వీడి బీజేపీతో చేరిన తరువాత ఆ పార్టీ పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యాయి. బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కు మొదట చేరికల కమిటీ చైర్మెన్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. అయితే చేరికలు జరగకపోగా.. సరైన ప్రదాన్యం ఇవ్వడం లేదని ఈటెల అలకబూనడంతో అదే టైమ్ లో బండి సంజయ్ కి ప్రదాన్యత తగ్గిస్తూ ఈటెలను హైలెట్ చేస్తూ వచ్చింది అధిష్టానం. .

ఇక ఎన్నికల టైమ్ లో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, కొత్తగా కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించడం, ఈటెల రాజేందర్ కు పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ హోదాను కట్టబెట్టడంతో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. అధిష్టానం ఈటెల రాజేందర్ ను ఎక్కువ హైలెట్ చేస్తోందని ఇతర సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. పైగా ఈటెల మరియు బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ కారణంగా బండి కూడా పార్టీ వ్యవహారాల విషయంలో అంటి అంటనట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో విభేదాలు, కుమ్ములాటలు పెరుగుతూ వచ్చాయి.

అయినప్పటికి అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ కు ఏకంగా రెండు చోట్ల సీట్లు కేటాయించడంతో పార్టీలో అసంతృప్త వాదులు మెల్లగా కమలం పార్టీ నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. ఇలా సొంత పార్టీ నేతలను పక్కన పెట్టేంతలా ఈటెల రాజేందర్ కు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది బీజేపీ అధిష్టానం. అయితే ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం మూటగట్టుకోవడమే కాకుండా రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల.. రెండు చోట్ల కూడా ఓటమి చవిచూశారు. హుజూరాబాద్ సైతం బి‌ఆర్‌ఎస్ సొంతం చేసుకోవడంతో ఈటెల రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి సొంత పార్టీ నేతలను కాదని ఈటెలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన బీజేపీ.. ఆయన కారణంగానే బలహీన పడేందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో ఈటెల విషయంలో బీజేపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Also Read:ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం

- Advertisement -