బీజేపీ, కాంగ్రెస్‌లకు మంత్రి ఎర్ర‌బెల్లి బహిరంగ సవాల్..

240
errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ లు వ‌రంగ‌ల్-హ‌న్మ‌కొండ‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా స‌రే, రైతు బంధు ఇస్తున్నారా.. ఇస్తే రుజువు చేయాలి. అంటూ బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్ విసిరారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నారు. దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి, ఓ కార్యకర్తను బలిచేసి ప్రజలను మోసం చేసి గెలిచారు. బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు. ప్ర‌జ‌లు బీజేపీ మాయ‌లో ప‌డొద్దు. ద‌మ్ముంటే…బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో, ఏం చేశారో సాక్ష్యాధారాలతో చూపండి. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదు. త‌డిసి ముద్ద‌యిన లోత‌ట్టు ప్రాంతాల‌ను ఆదుకోలేదు. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో నీట మునిగిన ప్రాంతాల‌ను క‌నీసం చూసిపోలేదు. న‌యా పైసా ఇవ్వ‌లేదు. క‌నీసం ఆదుకోవాల‌న్న సోయి కూడా లేదు. మాట్లాడితే పేద‌ల‌సంక్షేమం అంటారు. తెలంగాణ రాష్ట్ర పేదల సంక్షేమంలో మీ పాత్ర ఏంటీ చెప్పండి? కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారి రైల్వేను, ప్రయివేటీకరణ చేసిన చరిత్ర బీజేపీది. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

వ‌రంగ‌ల్ నుంచి క‌రీంన‌గ‌ర్, భూపాల‌ప‌ల్లి, ఖ‌మ్మం, భ‌ద్రాచ‌లం లాంటి జాతీయ ర‌హ‌దారుల‌ని నిర్ల‌క్ష్యం చేశారు. బొంద‌లు, బోకెల‌తో ఆ రోడ్ల‌న్నీ ప్ర‌యాణానికి ఇబ్బందీగా మారాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించండి అంటే ప‌ట్టించుకోలేదు. పైగా అనేక విధాలుగా ఆపేందుకు కుట్ర‌లు ప‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు అనేక అవార్డులు ఇచ్చారు. మోడీ, కేంద్ర మంత్రులు అంతా క‌లిసి 10కిపైగా అవార్డులిచ్చారు. జాతీయ స్థాయిలో జ‌ల్ మిష‌న్ ప‌థ‌కంగా అమ‌లు చేస్తున్నారు. ఫ్లోరైడ్ ర‌హిత నీటిని అందిస్తున్న రాష్ట్రంగా పార్ల‌మెంటులోనే అభినందించారు. నీతి ఆయోగ్ ఇవ్వ‌మ‌ని చెప్పినా డ‌బ్బులు ఇవ్వ‌లేదు. భూ ఉప‌రితల నీటిని ప‌రిశుభ్ర‌ప‌ర‌చి స్వ‌చ్ఛంగా అందిస్తుంటే ప‌ట్టించుకోలేదు. కానీ, 35వేల కోట్లు ఖ‌ర్చు చేసిన స్కీంని ప‌ట్టించుకోని కేంద్రం, బోర్ల ద్వారా, నేరుగా నీటిని అందిస్తున్న గుజ‌రాత్ కి, అస‌లు మొద‌లే కాని ఉత్త‌ర ప్ర‌దేశ్ కి కూడా వేల కోట్లు అందిస్తున్నారు. ఎందుకు కేంద్రం తెలంగాణ‌ని చిన్న చూపు చూస్తున్న‌ది. తెలంగాణ ప్ర‌జ‌లు దేశంలో లేరా? దేశ పౌరులు కాదా? ఎందుకీ వివ‌క్ష‌? కెసిఆర్ చేప‌ట్టిన‌న్ని ప‌థ‌కాలు మీరేమైనా చేప‌ట్టారా? 12వేల‌‌ కోట్లు పెన్ష‌న్లు రాష్ట్రం ఇస్తుంటే… కేంద్రం ఇస్తున్న‌ది కేవ‌లం 2వేల కోట్లు. ‌మొత్తం మేమే ఇస్తున్న‌మ‌ని పోజులు కొడుతున్న‌రు. అని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

నిజంగా బీజేపీ నాయ‌క‌త్వానికి చిత్త‌శుద్ధి ఉంటే… తెలంగాణ‌కు ఏం చేశారు? మీరు తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పండి. ఏదో దుబ్బాక‌లో త‌ప్పుడు ప్ర‌చారాల‌తో, ఒక కార్య‌క‌ర్త‌ను బ‌లితీసుకుని, త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి గెలిచినంత మాత్రాన‌.. ఏదో వెల‌గ‌బెట్టిన‌ట్లు కాదు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా తెచ్చారా? ఏమైనా చేశారా? చెప్పండి. నిరుపేద‌ల‌కు అందుతున్న స్కీం ఏదైనా కేంద్రంది ఉందా చెప్పండి? అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బీజేపీని నిల‌దీశారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండ‌టం వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌మే త‌ప్ప ఈష‌న్మాత్రం ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌డం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు తెలంగాణ ప్రజలు- రైతులు సిద్ధం కావాలి. బీజేపీ నేతలు సిగ్గులేకుండా రైతుల పట్ల కపట నాటకాలు ప్రదర్శిస్తున్నారు. రైతాంగ మోట‌ర్ల‌కి మీట‌ర్లు బిగించ‌డానికి చూస్తున్నారు. ప్ర‌తి రైతు మీద ల‌క్ష రూపాయ‌ల భారం మోపేందుకు సిద్ధ‌ప‌డ్డారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డానికి కూడా ముందుకు రావ‌డంలేదు. కొత్త జీవోలు తెచ్చి, రైతుల క‌డుపుకొట్టేందుకు కూడా వెనుకాడ‌టం లేదు. బీజేపీ బాగోతాల‌ను తెలంగాణ రైతులకు అవగాహన కల్పిస్తాం. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.

ఈ మీడియా స‌మావేశంలో… ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప‌ ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, నన్న‌ప‌నేని న‌రేంద‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి మాట్లాడారు.

- Advertisement -