గ్రేటర్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా స్కైవేల నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆకాశమార్గాన బస్సు సర్వీసులను నడిపేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
మెట్రోకు అనుసంధానంగా ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఐటీ కారి డార్, గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ చిక్కులను తప్పించడంతోపాటు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలను స్టేషన్లతో అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్న నేపథ్యంలో నిధుల కొరత ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ ప్రాజెక్టును సుమారు 20 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.2,800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ బీఆర్‌టీఎస్ ప్రాజెక్టు కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి ఫోరం మాల్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, హెచ్‌ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో బీఆర్‌టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ప్రతీ కిలోమీటర్‌కు ఒక బస్ స్టేజీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుకు సైతం రైలు తరహాలో మూడు కోచ్‌లుంటాయి. రద్దీని బట్టి తొలుత రెండు కోచ్‌లు.. ఆ తరువాత మూడు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు.మెట్రోతో పోలిస్తే ఛార్జీలు తక్కువ… రెండు బస్సులు అటు ఇటు రాకపోకలు సాగించేలా ఆకాశ రోడ్డు మార్గం ఉంటుంది. కాలుష్యరహితం.. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుపుతారు. మెట్రో అంతా విశాలంగా కాకుండా చిన్న స్టేషన్లు వస్తాయి.మెట్రోలో వెళ్లినట్లే కార్డు, టోకెన్ స్టేషన్లలో స్వైప్ చేసి వెళ్లాలి.ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి.ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు.